తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరాన్ని తాకడంతో వానలు, ఈదురు గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో తూర్పుగోదావరిజిల్లా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కాలంగి నది, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల రిజర్వాయర్‌కు వరద ఉధృతి భారీగా పెరిగింది.బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దాని ప్రభావంతో ఏపీలో రాగల 48గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
వాయుగండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక ఏపీలో గంటకు 40 నుండి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అంతే కాకుండా తీర ప్రాంతాల వాసులకు అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇల్లలో నుండి బయటకు రావద్దని సూచించింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు రావడంతో సీఎం జగన్ పలు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
తుపాన్ ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.