ఇథియోపియాలోని అమ్హారా అనే ప్రాంతంలో షోంకే అనే పర్వత శిఖరంపై ఓ గ్రామం ఉంది. దాని పేరు షోంకే. ఇది చాలా పురాతనమైన గ్రామం. దాదాపు 900 ఏండ్ల క్రితమే ఈ ఊరు ఏర్పడినట్లు చెబుతుంటారు. అంతేకాదు ఇది ఎత్తయిన గ్రామం కూడా. సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఈ గ్రామం ఏర్పడింది. ఈ గ్రామానికి కేవలం రెండు ద్వారాలు మాత్రమే ఉంటాయి. అంటే ఈ గ్రామంలోకి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ఈ రెండు దారుల గుండానే వెళ్లాలి. గ్రామం లోపల ఎన్ని వీధులు తిరిగినా చివరకు గ్రామం నుంచి బయటకు రావాలంటే ఈ రెండు దారులే దిక్కు. అంతేకాదు ఈ రెండు దారుల వద్ద కాపలా కూడా ఉంటుంది. ఇలా షోంకే గ్రామానికి కేవలం రెండు దారులు మాత్రమే ఉండటం వెనుక ఓ కారణం ఉంది.
షోంకే ప్రజలను అర్గోబా అని కూడా పిలుస్తుంటారు. అర్గోబా అంటే అరబ్బులు లోపలికి వచ్చారు అని అర్థం. పూర్వం మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని ప్రారంభించినప్పడు పలు ప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో దాడుల నుంచి కాపాడేందుకు కొంతమంది ప్రజల్ని అప్పటి పాలకులు ఇథియోపియాలోని షోంకి పర్వతంపైకి పంపించారు. ఇతరుల నుంచి భద్రత కోసం ఆ గ్రామంలోకి వెళ్లేందుకు, వచ్చేందుకు కేవలం రెండు ద్వారాలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ ద్వారాల వద్ద కాపలాను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ద్వారాల వద్ద కాపలా కాస్తుండటం విశేషం. షోంకి గ్రామంలో ఇప్పటికీ ప్రాచీన తరహా ఇస్లాంనే బోధిస్తారు.
ప్రస్తుతం ఈ షోంకి గ్రామంలో జనాభా గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు దాదాపు 500 కుటుంబాలకు పైగానే ఉండేవి. ఇప్పుడు కేవలం 250 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. వ్యవసాయం, ఇతర పనుల కోసం చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. దీంతో షోంకి గ్రామంలో సగానికి పైగా జనాభా తగ్గిపోయింది. కొంతమంది మాత్రం తమ పూర్వీకులు బతికిన గ్రామం అనే సెంటిమెంట్‌తో అక్కడే కాలం వెల్లదీస్తున్నారు.