తిరుమల వేంకటేశ్వరస్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. నుదుటున మూడు నామాలు పెట్టుకుని ఎంతో భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గరుడవాహన సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు సీఎం. బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ నిర్వహించారు. తిరుమలలో ఉన్నటువంటి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ అక్కడి నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి తదితరులు స్వాగతం పలికారు. గోపూజ మందిరం, గో తులాభారంను ప్రారంభించారు ముఖ్యమంత్రి. సీఎం జగన్ తిరుమలకు రాకతో అధికారులు భారీ ఏర్పాట్లను నిర్వహించారు.
2022కు సంబంధించిన టీటీడీ క్యాలెండర్, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేశారు. బర్డ్ ఆస్పత్రిలో శ్రీపద్మావతి కార్డియాక్ సెంటర్ను ప్రారంభించారు. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడకమార్గం, పైకప్పును, గోమందిరంను ప్రారంభించారు.ఈ రాత్రికి సీఎం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. రేపు ఉదయం మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నడూ లేని రీతిలో శ్రీవారి ఉత్సవాలను ఈసారి ఏకాంతంగా జరపనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అధికారులు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.