టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది దాని తాలుకూ దుష్పలితాలు కూడా ఎక్కువవుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మహిళలకు కనీస రక్షణ కరవైన ఈ పరిస్థితుల్లో హాస్టల్, హోటల్, షాపింగ్ మాల్లో ట్రయల్ రూమ్.. ఇలా వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు ఉంటున్నాయి. స్పై కెమెరాలు కేవలం షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూముల్లో, హోటల్ గదుల్లో, హాస్టళ్లలో ఏ ప్రదేశంలోనైనా ఇలాంటివి ఉండే అవకాశాలు లేకపోలేవు. అందుకే తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎంతో అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. సాధారణంగా స్పై కెమెరాలను స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, ఏసీలు, వాల్ పెయింటింగ్స్, పుస్తకాలు, మొక్కలు, బొమ్మలు, లైట్లు, కుషన్లు, అలమరాలు, టిష్యూ బాక్స్‌లు వంటి వాటిలో దాచే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటివి ఉన్నాయా? లేదా? అని జాగ్రత్తగా చూడాలి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అక్కడి నుంచి బయటకు వచ్చేయటం మంచిది.
స్పై కెమెరాలను గుర్తించేందుకు అత్యంత సులువైన ఉపాయం ఫోన్‌ని ఉపయోగించటమే. ట్రయల్ రూమ్‌కి వెళ్లినప్పుడు గానీ, లేదా ఏదైనా కొత్త హోటల్ గదిలో దిగినప్పుడు గానీ అక్కడ రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారో లేదో తెలియాలంటే అక్కడే ఉండి ఎవరో ఒకరికి ఫోన్ చేయాలి. సాధారణంగా స్పై కెమెరాలు ఒక రకమైన రేడియో ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల ఫోన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ సమస్య వస్తుంది. లేదా ఫోన్ మాట్లాడుతుంటే గరగరమంటూ శబ్దం వినిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురైతే అక్కడ రహస్య కెమెరా ఉన్నట్లు అనుమానించాల్సిందే.
చాలామంది స్పై కెమెరాలను అద్దం వెనుకే పెడుతుంటారు. అంతేకాదు సాధారణ అద్దాలకు బదులుగా టూవే మిర్రర్స్‌ని కూడా కొన్ని ప్రదేశాల్లో అమర్చుతుంటారు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏ తరహా అద్దాలు ఉన్నాయో కూడా ఓసారి సరిచూసుకోవడం మంచిది. ఆ తర్వాతే అక్కడ స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయాలి. చూపుడువేలు కొసను అద్దానికి ఆనించి ఉంచాలి. ఇలా ఉంచినప్పుడు వేలికి అద్దంలో కనిపించే వేలి ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తే అది నిజమైన అద్దం. అలాకాకుండా వేలికి, దాని ప్రతిబింబానికి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా రెండూ పరస్పరం తాకుతున్నట్లు కనిపిస్తే అది టూవే మిర్రర్ అయి ఉండచ్చని భావించాలి. అలాగే ఆ అద్దం వెనుక ఎవరైనా స్పై కెమెరా కూడా పెట్టి ఉండచ్చు. కాబట్టి వెంటనే హోటల్ లేదా షాపింగ్‌మాల్ యాజమాన్యానికి దాని గురించి ఫిర్యాదు చేయటం బెటర్.