దేశ క్రికెటర్లు జాతీయ అసైన్మెంట్ల కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇస్తారని, ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో జరిగిన పొరపాట్లను నివారించడానికి బీసీసీఐ మెరుగైన షెడ్యూల్‌ను రూపొందించుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రపంచకప్ విజేత భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై న్యూజిల్యాండ్ ఘన విజయం తర్వాత టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా సెమీస్ చేరే దారులు పూర్తిగా మూసుకుపోయాయి. సోమవారం (అక్టోబర్ 8) నమీబియాతో జరిగే నామమాత్రపు మ్యాచ్ తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకుంటుంది. ఈ క్రమంలో కోహ్లీసేనపై విమర్శల వర్షం కురుస్తోంది. మాజీలు అందరూ టీమిండియా ప్రదర్శనపై మండిపడుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు.
,2012 తర్వాత ఓ ఐసీసీ టోర్నమెంట్లో కనీసం సెమీస్ కూడా చేరకుండా వెనుదిరగడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఇక మెగా టోర్నీలో నామమాత్రమైన నమీబియాతో ఆఖరి మ్యాచ్. గ్రూప్-2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ”నేనైతే భారత్ తరఫున ఆడేందుకే మొదటి ప్రాధాన్యమిస్తాను. ఆ తర్వాతే ఏదైనా. ఐపీఎల్లో ఆడొద్దని నేను చెప్పను. ఐపీఎల్ వల్లే చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ, దాన్ని ఆటగాళ్లు సక్రమంగా ఉపయోగించుకోలేపోతున్నారు. మ్యాచ్‌ల షెడ్యూలింగ్ విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి. భారత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టోర్నమెంట్లను ఖరారు చేయాలి” అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా స్పందించాడు. ప్రపంచకప్‌లలో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇది ఒకటని అభిప్రాయపడ్డాడు.