అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో టీమిండియా గంపెడాశలు గల్లంతైన నేపథ్యంలో రిక్తహస్తాలతోనే వెను దిరగాల్సిన పరిస్థితి. టోర్నీ ఆరంభంలో చేసిన భారత జట్టు చేసిన తప్పిదాల కారణంగా ఈవిధంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. నాకౌట్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమిండియా చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో దారుణంగా విఫలమైంది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో చిత్తుగా ఓడి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులకు గుండెకోతను మిగుల్చుతూ కనీసం సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగింది. 2012 తర్వాత ఐసీసీ ఈవెంట్లో భారత్ నాకౌట్ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్లు కోహ్లి సేనపై విమర్శల వర్షం కురిపిస్తుంటే మరి కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ టీమిండియాకు మద్దతుగా నిలిచాడు.
‘టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత దారుణమైన ప్రదర్శన చూసి నేను కూడా భాదపడ్డాను. అయితే ఆటగాళ్లు చాలా కాలం నుంచి బయో బబుల్‌లో ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి. మనకు వినోదం పంచడానికి వాళ్లు బయో బబుల్ జీవితాన్ని గడుపుతున్నారు. దీంట్లో వాళ్లు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఈ మెగా టోర్న్‌మెంట్‌లో మీరు బాగా ప్రయత్నించారు బాయ్స్” అని గంభీర్ పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్‌లో సూపర్ 12లో డ్రా అయిన రెండు గ్రూపుల మధ్య జట్లలో తేడాలున్నాయని అతడు తెలిపాడు. ఇకపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రౌండ్-రాబిన్ కాకుండా 2019 ప్రపంచ కప్ వంటి లీగ్ ఫార్మాట్‌ను నిర్వహించాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు.