మా’ ఎన్నికల ఘట్టానికి నిన్నటితో తెరపడింది. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. అప్పటి నుంచి ‘మా’ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మా ఫలితాలు వెలువడిన వెంటనే నాగబాబు ‘మా’ శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేయగా, మంచు విష్ణుతో అధ్యక్ష పదవికి పోటీపడిన ప్రకాశ్ రాజ్ కూడా ‘మా’ కు రాజీనామా చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. కాగా.. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సైతం ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. కాకపోతే ఆయన కొత్తగా ఎన్నికైన మంచు విష్ణు ప్యానెల్‌కు ఓ అల్టిమేటం జారీ చేశారు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని, నరేశ్ తప్పులు రుజువైతే తగిన చర్యలు తీసుకోవాలని.. ఇదంతా 15 రోజుల్లో నిజనిర్ధారణ చేసి తగిన చర్యలు తీసుకోకపోతే తానూ రాజీనామా చేస్తానని శివాజీరాజా ప్రకటించారు.
మా’ ఎన్నికల్లో గెలిచిన విష్ణుకు అభినందనలు తెలుపుతూ యం.పీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకాష్‌రాజ్ కన్నా తెలుగు సరిగ్గా మాట్లాడలేని వారు చాలా మంది ఉన్నారు. ఓటు వేయడానికి పనికొచ్చే ప్రకాష్‌రాజ్ పోటీకి పనికి రాడా? తెలుగు మాట్లాడడం కూడా సరిగా రానివారి మాటలను ప్రకాష్‌రాజ్ పట్టించుకోవద్దు. ‘మా’ సభ్యులుగా ప్రకాష్‌రాజ్ కొనసాగాలి’ అని ఆయన ప్రకాశ్ రాజ్ రాజీనామా పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.