రహదారులపై జరిగిన ప్రమాదాలు బీతి గొల్పుతున్నాయి. ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతుండగా అనేక మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రధానంగా ప్రమాదాలకు మానవ తప్పిదాలకు తోడు రోడ్ల పరిస్థితులు కూడా కారణమవుతున్నాయన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గుడిహత్నూర్ మండల సమీపంలోని బస్టాండ్ వద్ద గురువారం ఉదయం మంచిర్యాల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సు రోడ్డు పైకి ఎక్కే క్రమంలో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నజ్జయ్యింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
అంతేకాకుండా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటనలో లారీ డ్రైవర్ దే తప్పని స్థానికులు చెబుతున్నారు. బస్సు బస్టాండ్ నుండి వస్తుండగా లారీ డ్రైవర్ చూసుకోకుండా దూసుకు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ సంఘటనలో హైవే పైనుండి సర్వీస్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఓవర్ స్పీడే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దారికి అడ్డంగా ఉన్న ఈ రెండు వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారని, వారికి స్వల్ప గాయాలు మినహా ఏమి కాలేదని పోలీసులు తెలిపారు. వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.