మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం 11. 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ‘మా’ ఎన్నికలలో గెలిచి, అనంతరం పదవులకు రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ బృందం తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోషన్ ను ఎన్నికల సమయంలో రికార్డ్ చేసిన సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సింది గా కోరారు. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుతో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత ఆయన ప్యానెల్ లో నెగ్గిన అభ్యర్ధులు తో కలుపుకొని మొత్తం 11 మంది సభ్యులు సైతం మా సభ్వత్వానికి రాజీనామా చేశారు. మా ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని, బ్యాలెట్ పత్రాలు మారిపోయాయని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు లీడింగ్ లో ఉండగానే.. ఫలితాలు తారుమారు చేశారని రకరకాలుగా ప్రకాశ్ రాజ్ బృందం ఎన్నికల తీరుపై ఆరోపణలు చేశారు. అయితే వారు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, మా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని, ఎన్నికల అధికారి ఇటీవల క్లారిటీ ఇచ్చారు. అయితే దాంతో తృప్తి పడని ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కి ఓ లేఖ రాశారు.
తమకు న్యాయం చేయాల్సింది గా ఎన్నికల అధికారిని ప్రకాశ్ రాజ్ అందులో కోరారు. చాలా విచక్షణారహితంగా మోహన్ బాబు ప్రవర్తన ఉందని విమర్శించారు. మోహన్ బాబు, నరేశ్ ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఆ దృశ్యాలు చూస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు. ఆ సీసీ దృశ్యాలను మోహన్ బాబు తొలగించే అవకాశం ఉందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ క్రమంలో సీసీ కెమెరా దృశ్యాలను తమకు అందించాలని ఎన్నికల అధికారిని కోరారు.
సాధ్యమైనంత త్వరగా సీసీ ఫుటేజిలను తమకు అందించాలని తెలిపారు. పోలింగ్ రోజు మోహన్ బాబు, నరేశ్ బెదిరింపులకు దిగారని చెప్పారు. ప్రకాశ్ రాజ్ లేఖపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. పోలింగ్ రోజు నాటి సీసీ ఫుటేజిలు భద్రంగానే ఉన్నాయని, నిబంధనల ప్రకారం ఫుటీజ్ను ప్రకాశ్ రాజ్‌కు అందిస్తామని ఆయన వెల్లడించారు.