లాక్డౌన్ సమయంలో ఎన్నో వేల మందికి సాయం చేసి మన్ననలు అందుకున్న సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతోనే చాలామంది ఆయన్ని టార్గెట్ చేశారని అన్నారు. అందుకే ఈడీ, ఐటీ దాడులు చేయించి ఆయనపై దుష్ప్రచారం చేయించారని ఆరోపించారు. సోనూసూద్ ప్రజలకు సేవచేసే సమయంలో కూడా అతనిని ఐటీ, ఈడీ దాడులు చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని అన్నారు కేటీఆర్. సోనూసూద్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి సోనూసూద్ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో సోనూసూద్ స్పూర్తి నింపారని అన్నారు. రెండేళ్లుగా సోనూసూద్ విస్తృతంగా సేవలు అందిస్తున్నారని ఇలాంటి దాడులకు సోనూసూద్ భయపడాల్సిన అవసరం లేదని, ఆయనకు తామంతా అండగా ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
చాలా మందికి సాయం చేసిన తర్వాత ఐటీ దాడులు, ఈడీ సోదాలతో నటుడిని భయపెట్టేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. సోనూసూద్ నిజమైన హీరో అని, మనమందరం అతనికి అండగా ఉంటాం, ఎంతో మందికి సేవ చేయాలనే ఆశ ఉన్న నటుడితో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రామారావు తెలిపారు. హెచ్ఐసిసిలో కోవిడ్ యోధుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కెటి రామారావు అన్నారు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ తరపున నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.