శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్‌కుమార్ వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.
ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స చేశారు. కానీ డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు. పునీత్ రాజ్ కుమార్ కు ప్రస్తుతం 46 ఏళ్లు. ఎంతో కెరీర్ ఉండి, ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త గురించి తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు.
2002వ సంవత్సరంలో అప్పు సినిమాతో హీరోగా పునీత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే పునీత్‌ను అప్పూ అని ఫ్యాన్స్ పిలిచుకోవడం ప్రారంభించారు. వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, అంజనీపుత్ర వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హీరోగా ఆయన 29 సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఆయన నటించిన యువరత్న సినిమా విడుదలయింది.