దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలో పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు మరువలేనివని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. గోషామహల్ స్టేడియంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర గవర్నర్ డా. తమిళ సై సౌందర్ రాజన్ ఘననివాళులు అర్పించారు. గురువారం గోషామహల్ లో నిర్వహించిన కార్యక్రమంలో హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి తోపాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబ సభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
సమాజాన్ని నేర రహితంగా మార్చడానికి పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 1959 నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరులను గుర్తు చేసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు మరణించారని తెలిపారు. పోలీస్ వ్యవస్థ మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. పోలీస్ కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామన్నారు. పోలీసులు ఉగ్రవాదం, తీవ్రవాదం, ఇతర నేరాలను ఎదుర్కొన్నట్లే కోవిడ్ ను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అంతే పట్టుదలతో ఎదుర్కొన్నారని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు.