బ్రిటన్ లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్ ముప్పు క్రమంగా తగ్గుతోందని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటోంది. ఈ సమయంలో మళ్ళీ యూకే నుంచి షాకింగ్ వార్త వచ్చింది. మళ్ళీ అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతవారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 52,009 కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసుల పెరుగుదలని నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ లో 96 శతం ఏవై 4.2 వేరియంట్ వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా లండన్ జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్ వెల్లడించారు.
డెల్టా వేరియంట్ ఉపవర్గమైన ఏవై 4.2రకం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రెండేళ్లుగా కరోనా వైరస్ లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వేరియంట్ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరో నా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా కరోనా ఏవై 4.2 వేరియెంట్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారత్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. రష్యాలో 2 లక్షల 28 వేల 453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రజలను కోరారు.