మహరాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మద్‌నగర్ లోని కోవిడ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు రోగులు సజీవదహనమయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వార్డు లోని ఐసీయూలో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఐసీయూలో షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు.
ఆస్పత్రిలో ఖచ్చితంగా అగ్ని నివారణ వ్యవస్థ ఉంటుంది. ఈ ఆస్పత్రిలో అగ్ని నివారణ వ్యవస్థ యాక్టివేట్ అయిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ యాక్టివేట్ అయితే మంటలు ఎందుకు వ్యాపించాయి? యాక్టివేట్ కాకుంటే ఎందుకు కాలేదు? దానికి బాధ్యులెవరు? అనే దానిపై విచారణ జరగాల్సి ఉందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.