హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పనితీరు సరిగా లేదంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు. పేషెంట్ల వద్దకు నేరుగా వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రెండు సంవత్సరాలుగా సిటీ స్కానింగ్ పని చేయకపోతే దానిపైన మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కొందరు పేషెంట్లు బాలయ్యకు వైద్యుల పనితీరుపై ఫిర్యాదు చేశారు. కొందరు వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, ప్రైవేట్ క్లినిక్ లకు వెళ్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ నాలుగు రోజుల క్రితం చనిపోయిందని ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైద్యులపై బాలయ్య ఫైర్ అయ్యారు. చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైద్యుల పనితీరుకి, ఇప్పటి పనితీరుకి తేడా ఉందని అన్నారు.