ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారంతా “మా” పదవులకు రాజీనామా చేశారు. దీంతో మంచు విష్ణుకు రూట్ క్లియర్ అయినట్టుంది. రెండేళ్ల పాటు “మా”లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే వారు ఎవరూ ఉండరు. మూకుమ్మడి రాజీనామాల అనంతరం పలువురు మాట్లాడారు. “మా” సభ్యుల మంచికోసమే ఈ రాజీనామాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించింది. ఈ రెండేళ్లలో విష్ణు చేసే పనులుకు అడ్డుగా ఉండకూడదనే ఈ రాజీనామాలన్నారు.
మీడియాను పిలిచి ఈ విషయం స్వయంగా చెప్పారు ప్రకాష్ రాజ్. పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటామని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శ్రీకాంత్ అన్నారు. నరేశ్ అద్భుతంగా ఎన్నికలను నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారని సెటైర్ వేశారు. ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మోహన్ బాబు తనను అమ్మ నా బూతులు తిట్టాడని, తనీష్‌ను కొట్టబోయాడని చెప్పాడు.వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం ఉత్తమమని బెనర్జీ ఏడుస్తూ చెప్పాడు. ఇలా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.
”మా” కోసమే మా రాజీనామాలు. ఇది ప్రకాష్‌రాజ్ టీమ్ సూటిగా చెప్పిన మాట. ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్లం.. ప్రశ్నిస్తే గొడవలు జరుగుతాయి. అభివృద్ధి, సంక్షేమం ఆగిపోతుంది – అందుకే మా వాళ్లు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు ప్రకాష్‌రాజ్. మా.. ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి 11 మంది గెలిచారు. వాళ్లంతా రాజీనామా చేసేశారు. రిజైన్ చేసినా.. బయటి నుంచి ప్రశ్నిస్తుంటామని స్పష్టంచేశారు.
క్రాస్ ఓటింగ్ నుంచి పాటు పోస్టల్ బ్యాలెట్ వరకు అన్ని అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని, రాత్రికి రాత్రే ఫలితాలు తారు మారయ్యాయని ఆరోపించారు. టాలీవుడ్ ఆధిపత్య పోరుకు “మా” వేదికగా మారింది. ప్రస్తుతం మంచు, మెగా ఫ్యామిలీల మధ్య వార్ జరుగుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. మా ఎన్నికల సందర్భంలో చిరంజీవి బహిరంగంగా మాట్లాడకపోయినా.. ఆయన తమ్ముడు నాగబాబు మాత్రం బాహాటంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.