బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు సోమవారం కూడా బెయిల్ దొరకలేదు. జరిగిన విచారణలో భాగంగా ముంబయి కోర్టు మూడోసారి బెయిల్ నిరాకరించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ గత వారం రోజులుగా ముంబయి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) తన స్టేట్మెంట్ను కోర్టుకు సమర్పించిన తర్వాత బుధవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
గోవా నౌక డ్రగ్స్ కేసులో కుమారుడు ఆర్యన్‌ఖాన్ (23) జైలుపాలై కష్టాల్లో ఉన్న హిందీ సినిమాల సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. కష్టాన్ని నమ్ముకొని పైకెదిగిన షారుక్ ఈ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడతారని వారు తమ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ నేత, సీనియర్ నటుడు రాజ్‌బబ్బర్ ‘ఓ యోధుని కుమారుడు యోధుడిలాగే బయటికి వస్తాడు’ అని ట్వీట్ చేయడం విశేషం.
వాస్తవంగా శుక్రవారం వరకు ఆర్యన్ కస్టడీని పొడిగించాలని ఎన్సీబీ కోర్టును కోరింది. ప్రస్తుతానికి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన కోర్టు.. ఎన్సీబీకి బుధవారం వరకు మాత్రమే గడువు ఇచ్చింది. కాగా, ఆర్యన్ ఖాన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించారు. అతడి వద్ద డ్రగ్స్‌ను గుర్తించలేదని వెల్లడించారు. ఇన్నిరోజులు కస్టడీలో ఉంచడం సరికాదని వాదించారు.
దర్శకుడు అశ్విన్ చౌధరి, సంగీత దర్శకుడు విశాల్ దదలానీ సైతం షారుక్‌కు తమ మద్దతు తెలిపారు. హృతిక్ రోశన్, జోయా అఖ్తర్, ఫరా ఖాన్, హన్సాల్ మెహతా, రవీనా టాండన్, పూజాభట్, సుచిత్రా కృష్ణమూర్తి, సోమి అలి, హాస్యనటుడు జానీ లీవర్ తదితరులు ఇప్పటికే తమ సహనటుడికి అండగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.