రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకని, చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా విజయదశమిని జరుపుకొంటామని చెప్పారు. తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా దీవించాలని దుర్గామాతను ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. ఆ దుర్గామాత ఆశీస్సులతో దేశ ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గురువారం సిద్దిపేటలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆర్థికమంత్రి హరీశ్ రావు.. కుటుంబసమేతంగా పాల్గొన్న సంగతి తెలిసిందే.
విజయదశమి సందర్భంగా కేసీఆర్ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, ఇతర కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.