ఒక కొరియర్ కంపెనీలో పని చేసే ఉద్యోగి గణేశ్ రామన్ 100 గ్రాముల బంగారు కాయిన్ కొనుగోలు చేశాడు. దానిని పింక్ కలర్ పేపర్లో పెట్టి తన బెడ్ కింద ఉంచాడు. అయితే అది కనిపించకపోవడంతో గణేశ్ షాక్ అయ్యాడు. తన బెడ్ కింద ఉన్న గోల్డ్ కాయిన్‌ను భార్య తీసి పెట్టిందేమోనని అడిగితే తాను చూడలేదని, రూమ్ అంతా క్లీన్ చేసి చెత్తను బయట పడేశానని చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక గణేశ్ వెంటనే శాతంకుళం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు.
దీంతో వాళ్లు ఆ ఏరియాలో చెత్త క్లీన్ చేసింది ఎవరన్నది తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. మేరీ అనే శానిటేషన్ కార్మికురాలు అని గుర్తించి, ఆమెను విచారించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆ గోల్డ్ కాయిన్‌ను తిరిగి ఇచ్చేందుకు తమ సూపర్వైజర్ ద్వారా అధికారులకు అందజేసినట్లు తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. దానిని మేరీ చేతుల మీదుగానే నిన్న పోలీసులు గణేశ్ రామన్‌కు అందజేశారు. అది 7.5 లక్షలు ఉంటుందని అంచనా. అంత మొత్తం అయినా ఆమె తన పై అధికారికి అందించడంలో మేరీ నిజాయితీ అందరూ మెచ్చుకుంటున్నారు.
తాను తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తుండగా ఒక పింక్ కలర్ పేపర్ కింద పడి చిన్న శబ్ధం వచ్చిందని, ఇనుప ముక్కనో ఏదో అనుకున్నానని, కానీ ఓపెన్ చేసి చూస్తే అందులో బంగారు నాణెం ఉందని మేరీ చెప్పింది. మరో ఆలోచన చేయకుండా దానిని తీసుకెళ్లి తమ సూపర్వైజర్కు ఇచ్చానని తెలిపింది. దానిని ఆయన అధికారులకు అందజేశారని చెప్పింది. సుమారు ఏడున్నర లక్షల రూపాయల విలువ చేసే100 గ్రాముల బంగారు కాయిన్ చెత్తలో దొరికితే దానిపై ఆశపడకుండా వెనక్కి ఇచ్చేసింది. తమిళనాడులోని శాతంకుళం టౌన్లో ఈ ఘటన జరిగింది. తన ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రమే అయినా నిలువెత్తు నిజాయితీని చాటుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఆదర్శప్రాయంగా నిలిచింది.