ఫ్లాష్… ఫ్లాష్… ఫ్లాష్ : నటి, క్లాసికల్ డాన్సర్ అయిన సుధా చంద్రన్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బోజ్‌పూరి, మరాఠి ఇలా అన్ని భాషల్లో నటించారు. సినిమాలతో పాటూ సీరియల్స్ లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. క్లాసికల్ డాన్సర్ అయిన సుధా చంద్రన్ భరతనాట్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నో షోస్ నిర్వహించారు. కొన్ని షో స్ కి జడ్జిగా ఉన్నారు. ‘మయూరి’ సినిమాతో జాతీయఅవార్డుని, నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఇప్పడామె గురించి చర్చ ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో అధికారుల వల్ల తమకి ఎదురవుతున్న ఇబ్బందులను చెబుతూ ఆమె నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేశారు. కృత్రిమ అవయవదారులకు మన దేశంలోని తన లాంటి సీనియర్ సిటిజన్లకు తనిఖీల పేరుతో విమానాశ్రయాల్లో తీవ్ర అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్(56) ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ వీడియోను ఆమె పోస్టు చేశారు. వృత్తి రీత్యా విమానాల్లో ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. కృత్రిమ అవయవాల్లో పేలుడు పదార్థాల వంటివి తీసుకొస్తారనే అనుమానం ఉంటుంది కనుక సంబంధిత తనిఖీలు చేసుకోవడంలో అభ్యంతరం లేదన్నారు. అయితే, విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేపట్టే ప్రతిసారీ తన కృత్రిమ కాలును తొలగించి చూపించాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇది తనలాంటి వారికి ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు అయిన మహిళలకు ఎంతో ఇబ్బందికరమని సుధా చంద్రన్ వివరించారు.
దీంతో శుక్రవారం సీఐఎస్ఎఫ్ స్పందించింది. “సుధా చంద్రన్‌కు కలిగిన అసౌకర్యానికి మేం తీవ్రంగా చింతిస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారం, అసాధారణ సందర్భాల్లో మాత్రమే భద్రతా తనిఖీల కోసం కృత్రిమ అవయవాలను (ప్రాస్థటిక్స్) తొలగించమని చెబుతాం. ప్రాస్థటిక్స్ను తొలగించమని సుధా చంద్రన్‌ను సంబంధిత మహిళా సిబ్బంది ఎందుకు కోరారో మేం పరిశీలన జరుపుతాం. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రోటోకాల్స్ విషయంలో మా మొత్తం సిబ్బందికి మరోసారి అవగాహన కల్పిస్తామని సుధా చంద్రన్‌కు హామీ ఇస్తున్నాం.” అని ట్వీట్ చేసింది.